
న్యూస్ డెస్క్: తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ రాజకీయంగా మరింత ఒత్తిడిలోకి వెళ్లారు. కరూర్ రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు పాక్షికంగా ఉందని టీవీకే ఆరోపిస్తోంది. హైకోర్టు అనుమతితో రాష్ట్ర పోలీసు అధికారులే దర్యాప్తు చేస్తుండటాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సిట్‌ను సీబీఐ ఆధ్వర్యంలోకి మార్చాలని పార్టీ డిమాండ్ చేస్తోంది.
విజయ్ తన పిటిషన్‌లో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు దర్యాప్తుపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా “విజయ్ నాయకత్వ లక్షణాలు లేవు, ఘటన తర్వాత పారిపోయాడు” వంటి వ్యాఖ్యలు పబ్లిక్ ఇమేజ్‌కు నష్టం కలిగించాయని వాదించారు.
అదే సమయంలో టీవీకే ర్యాలీలో భద్రతా లోపం పోలీసులు నిర్లక్ష్యంతోనే జరిగిందని స్పష్టం చేశారు. మరోవైపు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 13 ఏళ్ల బాలుడి తండ్రి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, సీబీఐ విచారణ కోరారు.
ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. విజయ్ రాజకీయ ఎంట్రీకి ఇది పెద్ద పరీక్షగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
