
న్యూస్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా తెలంగాణ టీడీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. చాలా కాలం తర్వాత తెలంగాణ రాజకీయాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక, మరియు మండల కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.78 లక్షల సభ్యత్వ నమోదు పూర్తయిందని నేతలు వివరించగా, చంద్రబాబు పార్టీని క్షేత్రస్థాయిలో పునరుద్ధరించేందుకు దిశానిర్దేశం చేశారు.
మూడు రోజులలోపుగా 638 మండల, జిల్లా కమిటీల నియామకం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. సరైన నాయకత్వంతో టీడీపీ మళ్లీ తెలంగాణలో పట్టు సాధించగలదని నేతలు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు కూడా “పార్టీని సమర్థంగా నడిపించగల నాయకుడికే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తాం” అని స్పష్టంగా చెప్పారు.
ఈ సమావేశానికి బక్కని నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్, నందమూరి సుహాసిని, కంభంపాటి రామ్మోహన్ తదితర నాయకులు హాజరయ్యారు.
తెలంగాణ టీడీపీ పునరుద్ధరణకు ఇది తొలి అడుగు కావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు పునరుద్ధరణ యత్నాలు ఫలిస్తే, 2028 ఎన్నికల్లో టీడీపీ బలమైన రీఎంట్రీ ఇవ్వగలదనే అంచనాలు ఉన్నాయి.