
న్యూస్ డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన ఒకటి తర్వాత ఒకటి అధికారిక సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు.
మొదటగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన చంద్రబాబు, పూర్వోదయ పథకంలో ఆంధ్రప్రదేశ్‌ను కూడా భాగస్వామ్య రాష్ట్రంగా చేర్చాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు నిధులు కేటాయించమని, అలాగే పోలవరం పూర్తి చేయడంలో సహకరించాలని ఆయన విన్నవించారు.
అదే సమయంలో అమరావతి అభివృద్ధికి వచ్చే బడ్జెట్‌లో కనీసం 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని అభ్యర్థించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం వెనుకబడిందని, ఇప్పుడు గాడిలో పెడుతున్నామని వివరించారు.
చంద్రబాబు, నవంబర్ 14-15న విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు నిర్మలా సీతారామన్‌ను ఆహ్వానించారు. ఇప్పటికే దేశ విదేశాల పారిశ్రామిక వేత్తల నుంచి రూ. 9.7 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కోసం కూడా చంద్రబాబు వేచి చూస్తున్నారు. అలాగే పారిశ్రామిక వేత్తలతో మీటింగ్ చేసి, సదస్సుకు హాజరయ్యేలా ఆహ్వానించారు.
అమరావతి, పోలవరం ప్రాజెక్టుల ఫోటోలను కూడా కేంద్ర మంత్రులకు చూపించి నిధుల కేటాయింపుపై సానుకూల స్పందన పొందారని సమాచారం. మొత్తానికి ఢిల్లీలో చంద్రబాబు పర్యటన రాష్ట్ర ప్రాజెక్టులకే ప్రాధాన్యతగా మారింది.
