
ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీకి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రాజంపేటలో జరిగిన ప్రజా వేదిక సభలో మాట్లాడుతూ, గత ఐదేళ్ల వైసీపీ పాలనపై తాను ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. “దమ్ముంటే అసెంబ్లీకి రండి, ఎవరిది విధ్వంసమో ఎవరిది అభివృద్ధో ప్రజల ముందు తేల్చుకుందాం” అని ఆయన సూటిగా సవాల్ చేశారు.
చంద్రబాబు మాట్లాడుతూ బాబాయ్ హత్య, కోడికత్తి డ్రామా, ఎన్నికల అక్రమాలు వంటి అంశాలపై అసెంబ్లీలో చర్చించేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. “ప్రజాస్వామ్యంలో ప్రెస్ మీట్లు కాకుండా అసెంబ్లీ వేదికే చర్చల కోసం సరైన ప్రదేశం” అని వైసీపీ నేతలకు గుర్తు చేశారు.
పెన్షన్ల విషయమై కూడా మాజీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. అనర్హులకు దివ్యాంగుల పెన్షన్లు ఇచ్చారని, నిజమైన అర్హులు నష్టపోయారని ఆరోపించారు. “పెన్షన్ పేదలకు ఇచ్చే దానం కాదు, అది ప్రభుత్వ బాధ్యత” అని ఆయన అన్నారు.
ఆర్థిక విధానాలపై మాట్లాడుతూ, అప్పులతో సంక్షేమం సాధ్యం కాదని, సంపద సృష్టించి పంచడమే తన విధానమని చెప్పారు. “అప్పు చేసి పప్పు కూడు తింటే చివరికి చిప్పే మిగులుతుంది” అంటూ గత ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
రాయలసీమ అభివృద్ధిపై దృష్టి సారించిన చంద్రబాబు, నీటి ప్రాజెక్టులు, పరిశ్రమల ద్వారా ప్రాంతాన్ని రత్నాల సీమగా మార్చుతానని భరోసా ఇచ్చారు. ప్రజలే తన బలం అని, వారి సహకారంతో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.