
న్యూస్ డెస్క్: రాష్ట్రంలో వైసీపీ తప్పుడు ప్రచారాలతో ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నం చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. సోమవారం జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చేసే అసత్యాలను ఎప్పటికప్పుడు ఖండించాలని, ఈ విషయంలో ప్రతి నేత చొరవ చూపాలని ఆయన సూచించారు.
చంద్రబాబు మాట్లాడుతూ, రాజధాని మునిగిపోయిందని, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని వైసీపీ ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ప్రచారం చేస్తోందని అన్నారు. సోషల్ మీడియా, సొంత ఛానెల్స్, పత్రికల ద్వారా ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించడమే వారి విధానం అని మండిపడ్డారు. అలాంటి తప్పుడు ప్రచారాలు ప్రజలకు నిజమని అనిపించే ముందు వాటిని బలంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వం చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం విజయవంతమైందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.24 కోట్ల కుటుంబాలను నేరుగా కలసి పథకాలను వివరించామని చెప్పారు. సాంకేతికతను వినియోగించి నాయకుల పర్యటనలను పర్యవేక్షించామని, ప్రజలలో సానుకూల స్పందన లభించిందని పేర్కొన్నారు.
పార్టీ నేతలు ప్రజలతో మాట్లాడేటప్పుడు క్రమశిక్షణగా వ్యవహరించాలని చంద్రబాబు హితవు పలికారు. మంచి పనులను విస్తృతంగా చాటి చెప్పాలని, చెడు చేసే వారి గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. వివాదాలకు దారితీయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.