
న్యూస్ డెస్క్: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా మరోసారి తన ప్రతిభను రుజువు చేశాడు. కొంతకాలం ఫామ్ దూరం, క్రమశిక్షణ సమస్యలతో విమర్శలు ఎదుర్కొన్న షా, మహారాష్ట్ర తరఫున తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన సెంచరీతో పునరాగమనం చేశాడు. బుచ్చిబాబు ట్రోఫీలో ఛత్తీస్‌గఢ్‌పై 111 పరుగులు చేసి జట్టును గౌరవప్రద స్థితికి చేర్చాడు.
242 పరుగుల లక్ష్య ఛేదనలో మహారాష్ట్ర 217 పరుగులకే ఆగిపోయినా, షా ఒంటరిగా పోరాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతని బ్యాట్ నుంచి వచ్చిన పరుగులు జట్టు మొత్తం స్కోరులో సగానికి పైగా ఉండటం విశేషం. ఈ ఇన్నింగ్స్‌తో తన పాత రోజులను గుర్తు చేశాడు.
మ్యాచ్ అనంతరం షా మాట్లాడుతూ, “నా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. మళ్లీ మొదటి నుంచి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాను. నా సామర్థ్యంపై నాకెప్పుడూ నమ్మకం ఉంది” అని చెప్పాడు. తన ఆటలో పెద్దగా మార్పులు చేయలేదని, కేవలం బేసిక్స్‌పై దృష్టి పెట్టానని వివరించాడు.
సోషల్ మీడియా తనను డైవర్ట్ చేస్తుందని, ఇప్పుడు దానికీ దూరంగా ఉండడం వల్ల ప్రశాంతంగా ఉన్నానని షా చెప్పాడు. “నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు. నా కుటుంబం, నిజమైన స్నేహితులు నాకున్న పెద్ద బలం” అని స్పష్టం చేశాడు.
ఈ సెంచరీతో షా మరోసారి క్రికెట్‌లో బలమైన రీఎంట్రీ ఇచ్చాడు. రాబోయే మ్యాచ్‌లలో అతని ప్రదర్శనపై అభిమానులు, నిపుణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
