
హైదరాబాద్: విద్యుత్ తీగల కారణంగా జరిగిన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న రామంతాపూర్‌లో జరిగిన కృష్ణాష్టమి ఉరేగింపులో రథం తీగలకు తగలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో నగరం విషాదంలో మునిగిపోయింది.
ఇదిలా ఉండగా, నిన్న పాతబస్తీ బండ్లగూడలో గణేశ్ విగ్రహం తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో అంబర్‌పేట్‌లో రామ్‌చరణ్ అనే యువకుడు విద్యుత్ తీగలను తొలగించే క్రమంలో షాక్ తగిలి మరణించాడు.
కేవలం రెండు రోజుల వ్యవధిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం నగరంలో భయం పెంచుతోంది. స్థానికులు రహదారులపై తీగలు తక్కువ ఎత్తులో ఉండటమే ఈ ప్రమాదాలకు కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, విగ్రహాల రవాణా, ఉరేగింపుల సమయంలో విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ, మునిసిపల్ శాఖల మధ్య సమన్వయం ఉండాలి. ముందస్తు చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు నివారించవచ్చని సూచించారు.
ప్రస్తుతం అధికారులు అప్రమత్తమై భవిష్యత్తులో భద్రతా చర్యలను బలోపేతం చేయాలని భావిస్తున్నారు. కానీ వరుస ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. భక్తులు, నివాసితులు ఇకనైనా విద్యుత్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
