
న్యూస్ డెస్క్: రష్యా ఉక్రెయిన్ యుద్ధం నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సంక్షోభాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ముందుకొచ్చారు. ఇటీవల వైట్ హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చించిన తర్వాత, రష్యా అధ్యక్షుడు పుతిన్ మరియు జెలెన్‌స్కీ భేటీ జరగనుందని ప్రకటించారు. దీనిని శాంతి చర్చల్లో కీలక మలుపుగా అభివర్ణించారు.
అయితే, ట్రంప్ ఈ ప్రక్రియను తన రాజకీయ విజయంగా చూపించుకోవాలని చూస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. గతంలో భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని చెప్పినట్లే, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ సమస్యలో తానే ప్రధాన పాత్ర వహిస్తున్నానని చూపించుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది.
అమెరికా కోణంలో చూసుకుంటే ఈ శాంతి చర్చల వల్ల పలు లాభాలున్నాయి. మొదటగా, యూరప్ అంతటా ఇంధన ధరలు తగ్గుతాయి. దీంతో అమెరికా శక్తివంతమైన పీస్ మేకర్‌గా నిలుస్తుంది. రెండవది, ట్రంప్ తనను ప్రపంచ నాయకుడిగా చూపించుకోవడానికి ఇది మంచి అవకాశం.
అంతేకాకుండా, యూరప్ దేశాలను తన వైపు ఉంచుకోవడం, నాటోలో అమెరికా ఆధిపత్యం కొనసాగించుకోవడం కూడా సులభమవుతుంది. చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ఇది అమెరికాకు బలాన్నిస్తుంది. రష్యాతో నేరుగా చర్చలు జరగడం ద్వారా అంతర్జాతీయ సమీకరణల్లో అమెరికా ప్రాధాన్యత పెరుగుతుంది.
గ్లోబల్ మార్కెట్లు స్థిరపడితే అమెరికా బిజినెస్‌లకు కూడా పెద్ద లాభం ఉంటుంది. టెక్, ఆటోమొబైల్, ఫార్మా రంగాలకు పెట్టుబడులు పెరుగుతాయి. మొత్తానికి, పుతిన్ జెలెన్‌స్కీ భేటీ ఎప్పుడెప్పుడు జరుగుతుందన్న దానిపై స్పష్టత రాకపోయినా, ట్రంప్ ఇప్పటికే దీన్ని తన విజయంగా ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది.
