
న్యూస్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ పార్టీగా కేటీఆర్ అభివర్ణించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ అపరిపక్వతను చూపిస్తున్నాయని జగ్గారెడ్డి విమర్శించారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, “వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ను మీరు చిల్లర పార్టీ అంటారా? అదే పార్టీ నుంచి రాజకీయాలు నేర్చుకున్న మీ నాన్న కేసీఆర్ కూడా థర్డ్ క్లాస్ అవుతారా?” అంటూ నిలదీశారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని, దాన్ని కేసీఆర్ అసెంబ్లీలో స్వయంగా అంగీకరించారని గుర్తు చేశారు.
“సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీ కుటుంబం అమెరికాలో జీతం కోసం పనిచేసేది. వేల కోట్లు సంపాదించే అవకాశం ఉండేది కాదు” అంటూ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్ మాటలను ఇప్పుడు మరిచిపోయారా అని ప్రశ్నించారు.
కేటీఆర్ పదేళ్లు మంత్రిగా ఉన్నా రాజకీయ పరిణతి రాలేదని, బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. “ఇలాంటి మాటలు చెప్పినట్లయితే మీ తాత, నానమ్మ బతికి ఉంటే చెంప మీద కొట్టేవారు” అంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు.
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తాను సచివాలయంలో సమీక్షలు నిర్వహిస్తే బీఆర్ఎస్ విమర్శిస్తోందని, అవి ఆగవని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ గౌరవాన్ని తక్కువ చేయాలన్న ప్రయత్నాలు విఫలమవుతాయని ఆయన వ్యాఖ్యానించారు.
