
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల ఉచ్చు సెలబ్రిటీల చుట్టూ బిగుసుకుంటోంది. ఈడీ (ED) విచారణల తర్వాత, ఇప్పుడు సీఐడీ (CID) రంగంలోకి దిగింది. నిన్న (బుధవారం) విజయ్ దేవరకొండ విచారణకు హాజరు కాగా, నేడు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ సీఐడీ అధికారుల ముందు హాజరయ్యారు.
విచారణ అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. యువత ఈ యాప్స్‌కు బానిసలై ప్రాణాలు కోల్పోవడం దారుణం” అని ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ఎవరూ వాడొద్దని, ప్రమోట్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాను 2016లో ఓ యాప్‌ను ప్రమోట్ చేశానని, అది గేమింగ్ యాప్ అనుకున్నానని, బెట్టింగ్ అని తెలిశాక వదిలేశానని స్పష్టం చేశారు. ఆ యాప్ 2017లో నిషేధానికి గురైందని, దానికి సంబంధించిన నిర్వాహకుల సమాచారాన్ని సీఐడీకి అందించినట్లు తెలిపారు.
నిన్న విజయ్ దేవరకొండ కూడా తాను ప్రమోట్ చేసిన ‘A23’ యాప్ తెలంగాణలో ఓపెన్ కాదని, లావాదేవీల స్టేట్‌మెంట్లను అధికారులకు సమర్పించానని క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు, యూట్యూబర్ సిరి హనుమంతును కూడా సీఐడీ అధికారులు విచారించారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బుతో ఆమె మూడు బ్యూటీ హాస్పిటల్స్ నిర్మించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
