
ఆపిల్ వాచ్ సైరన్ ప్రాణాలు కాపాడింది.. ఎలాగంటే?
న్యూస్ డెస్క్: ముంబైకి చెందిన యువ టెకీ క్షితిజ్ జోడాపే పుదుచ్చేరి తీరంలో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రాణాపాయంలో పడిపోయాడు. అయితే అతడి మణికట్టుకు ఉన్న ఆపిల్ వాచ్ అల్ట్రా వెంటనే అలర్ట్ ఇవ్వడం వల్ల అతను ప్రాణాలతో బయటపడ్డాడు.
క్షితిజ్ స్కూబా డైవింగ్ చేస్తుండగా వెయిట్ బెల్ట్ సడన్‌గా విడిపోవడంతో అతను వేగంగా పైకి లేచాడు. ఇది ఊపిరితిత్తులకు ప్రమాదకరమై ప్రాణానికి ముప్పు కలిగించే పరిస్థితి. ఈ సమయంలో అతడి ఆపిల్ వాచ్ అల్ట్రా ‘బీప్’ అలర్ట్ ఇచ్చి, అత్యవసర సైరన్‌ను యాక్టివేట్ చేసింది.
సైరన్ శబ్దం విని అతడితో ఉన్న డైవింగ్ ఇన్స్ట్రక్టర్ వెంటనే అప్రమత్తమై అతని ఆరోహణ వేగాన్ని నియంత్రించాడు. దీని వలన క్షితిజ్ ప్రాణాపాయంలో నుంచి బయటపడ్డాడు. “నేను ప్రమాదాన్ని పూర్తిగా గ్రహించేలోపు నా వాచ్ సైరన్ మోగింది. అదే నన్ను కాపాడింది” అని క్షితిజ్ చెప్పుకొచ్చాడు.
తర్వాత క్షితిజ్ ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు లేఖ రాయగా, కుక్ వ్యక్తిగతంగా స్పందించి అతను సురక్షితంగా ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.
ఆపిల్ వాచ్ అల్ట్రా ప్రత్యేకంగా సాహస క్రీడలు, అత్యవసర పరిస్థితుల కోసం రూపొందించబడింది. ఇందులోని సైరన్ దాదాపు 180 మీటర్ల దూరంలో వినిపిస్తుంది. ఈ ఘటన టెక్నాలజీ సకాలంలో ఎంత ప్రాణరక్షకంగా మారుతుందో మరోసారి నిరూపించింది.