
తెలంగాణ: రాజకీయాల్లో కుటుంబ విభేదాలు మళ్లీ హాట్ టాపిక్ అవుతున్నాయి. దసరా వేడుకల సమయంలో కూడా కేసీఆర్ కవితల మధ్య దూరం బహిర్గతమైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేసిన తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు. ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత చేసిన ఆరోపణలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి.
అయితే కవిత తండ్రి కేసీఆర్ లేదా అన్న కేటీఆర్‌పై నేరుగా వ్యాఖ్యలు చేయలేదు. దీనితోనే కేసీఆర్ మరింత కోపంగా మారారని పార్టీ వర్గాల సమాచారం.
దసరా రోజున ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో జరిగిన పూజలకు కుటుంబం మొత్తం హాజరైనప్పటికీ, కవిత మాత్రం అక్కడ కనిపించలేదు. కేటీఆర్ కుటుంబం, ఇతర బంధువులు పాల్గొన్న వేడుకలలో కవితను ఆహ్వానించలేదని చెబుతున్నారు.
ఇది రాజకీయాలకు సంబంధం లేకుండా పండుగ సమయంలో కూడా జరుగుతుండటంతో విభేదాలు ఎంత లోతుగా ఉన్నాయో అర్థమవుతోందని పరిశీలకులు అంటున్నారు.
అంతకు ముందు హోమం సమయంలోనూ కవితను ఆహ్వానించలేదని సమాచారం. మరోవైపు కవిత మాత్రం తన అనుచరులతో దసరా జరుపుకుంటూ సంప్రదాయాలను పాటించారు. పాలపిట్ట ఎగరేసి ప్రత్యేక వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రస్తుతం కేసీఆర్ కవితల విభేదాలు కేవలం రాజకీయాలకే పరిమితం అవుతున్నాయా? లేక కుటుంబ బంధాలను కూడా దెబ్బతీస్తున్నాయా అన్నది చర్చనీయాంశమైంది.
