
న్యూస్ డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ చర్చ పెద్ద రచ్చకు దారితీసింది. లోక్‌సభలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ పాకిస్థాన్ పరిస్థితులపై క్లారిటీ ఇవ్వగా విపక్షాలు వరుసగా అడ్డుకున్నారు. ఈ పరిస్థితిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహనం కోల్పోయారు.
జైశంకర్ చెప్పిన కీలక విషయాలు విపక్షాలు వినకుండా పదేపదే బహిరంగ నిరసన చేపట్టారు. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఎలాంటి కాల్ జరగలేదని జైశంకర్ స్పష్టంగా చెప్పారు. దీనిపై విపక్షాలు సందేహం వ్యక్తం చేయడంతో అమిత్ షా మధ్యలో జోక్యం చేసుకున్నారు.
“మీరు మీ దేశ విదేశాంగ మంత్రిని నమ్మకుండా, ఇతర దేశాల మాటలను నమ్మడం సరికాదు” అంటూ అమిత్ షా విపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి విదేశీ ప్రాముఖ్యత ఎక్కువగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
విపక్ష నేతల వ్యాఖ్యలకు స్పందిస్తూ షా, “మీ నాయకులు మాట్లాడినప్పుడు మేం సహనంతో విన్నాం. ఇప్పుడు సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు” అన్నారు.
పార్లమెంట్‌లో జరిగిన ఈ ఘర్షణ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ వివాదంపై మరిన్ని స్పందనలు రావొచ్చని అనుకుంటున్నారు.