
న్యూస్ డెస్క్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మహిళల దుస్తులపై ఆంక్షలు విధించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని యూనస్ ప్రభుత్వం ఇటీవల కొత్త ఆదేశాలు జారీ చేసింది.
ఇందులో మహిళా ఉద్యోగులు పొట్టి దుస్తులు, స్లీవ్ లెస్, లెగ్గింగ్స్ ధరించకుండా నిషేధించగా, సంప్రదాయ దుస్తులు ధరించాలని పేర్కొన్నారు. అదనంగా, హెడ్‌స్కార్ఫ్ లేదా హిజాబ్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. పురుషులకు కూడా జీన్స్, చినో ట్రౌజర్స్‌పై నిషేధం విధించారు.
ఈ ఆంక్షలపై ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ ఆదేశాలను తాలిబన్ పాలనతో పోల్చుతూ విమర్శలు వెల్లువెత్తాయి. యూనస్ ప్రభుత్వం డిక్టేటర్‌షిప్ అనిపించుకుందన్న వ్యాఖ్యలు ట్రెండ్ అయ్యాయి.
బంగ్లాదేశ్ బ్యాంక్ జారీ చేసిన ఆదేశాలను పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనికి తీవ్ర వ్యతిరేకత రావడంతో దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, పౌరులు పెద్ద ఎత్తున నిరసనలో దిగారు.
దీనిపై తాలిబన్ పాలనను గుర్తు చేస్తోందని సోషల్ మీడియాలో చర్చలు జోరందుకున్నాయి. చివరకు గురువారం బ్యాంక్ ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంది.
