
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్‘ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. రూ. 700 కోట్లకు పైగా వసూళ్లతో కోలీవుడ్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ అఖండ విజయంలో రజినీకాంత్ హీరోయిజం ఎంత కీలకమో, విలన్‌గా వినాయకన్ పోషించిన ‘వర్మ’ పాత్ర కూడా అంతే కీలకం. సీరియస్‌నెస్‌తో పాటు అతడు పండించిన విలక్షణమైన కామెడీ సినిమాకు ప్రాణం పోసింది.
అయితే, ‘జైలర్’ క్లైమాక్స్‌లో వర్మ పాత్ర ముగిసిపోతుంది. ఇప్పుడు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ‘జైలర్ 2’లో చాలా పాత్రలు కొనసాగుతున్నా, విలన్ మారాడు. ఈసారి ప్రతినాయకుడి పాత్రను విలక్షణ నటుడు ఎస్.జె. సూర్య పోషిస్తున్నారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. వినాయకన్ స్థానాన్ని సూర్య భర్తీ చేయగలడా?
వినాయకన్ ‘వర్మ’గా భయాన్ని, నవ్వును ఏకకాలంలో పండించగలిగాడు. అతని డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ, ఎస్.జె. సూర్య ప్రధానంగా సీరియస్, ఇంటెన్స్ పాత్రలకు పెట్టింది పేరు. అతని నుంచి వర్మ తరహా కామెడీ విలనీని ఆశించలేం.
ఈ మార్పు ‘జైలర్ 2’కు ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొదటి భాగంలో వర్మ పాత్ర చనిపోయినా, ఏదో ఒక రూపంలో వినాయకన్‌ను తిరిగి తీసుకొస్తే బాగుండేదని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ప్రస్తుత సమాచారం ప్రకారం ఆ దిశగా ప్రయత్నాలు జరిగినట్లు లేదు.
దీంతో, భారం మొత్తం ఎస్.జె. సూర్య, యోగిబాబుతో పాటు కొత్తగా చేరిన బాలకృష్ణ, మిథున్ చక్రవర్తి వంటి స్టార్ల మీద పడుతుంది. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ కూడా కొనసాగుతున్నారు. ఇంతమంది స్టార్లు ఉన్నా, ‘జైలర్’ మ్యాజిక్‌లో కీలకమైన వర్మ లాంటి విలన్ లేని లోటు కనిపిస్తుందా? లేక నెల్సన్ తనదైన మార్క్‌తో సూర్య పాత్రను అంతకుమించి నిలబెడతాడా? అన్నది తేలాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.
