
న్యూస్ డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరమవడంతో, ఆ పార్టీ ఓటర్లు ఎటువైపు మొగ్గుతారనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయ్యింది.
మొదట పోటీ చేస్తామని భావించిన టీడీపీ, కేడర్ సన్నద్ధత లేకపోవడంతో చివరికి తప్పుకుంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు.
2014 ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో టీడీపీ ఈ స్థానం గెలుచుకుంది. అయితే తర్వాత పరిణామాల నేపథ్యంలో గోపీనాథ్ బీఆర్ఎస్లో చేరి వరుసగా రెండుసార్లు గెలిచారు. ఇప్పుడు ఆయన భార్య సునీత బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు.
దీంతో టీడీపీ సానుభూతిపరులు ఆమెకు మద్దతు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ కూడా బలంగా పోటీకి సిద్ధమవుతోంది. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గ ఓట్లు ఈ ఎన్నికలో నిర్ణయాత్మకంగా మారే అవకాశముంది.
అంతేకాదు, ఏపీలో బీజేపీతో టీడీపీ పొత్తు ఉన్న నేపథ్యంలో, చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించే అవకాశం కూడా రాజకీయ వర్గాలు ఊహిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీకి దూరంగా ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి విజయోత్సవ ర్యాలీలో టీడీపీ జెండాలు కనిపించడం గమనార్హం.
మొత్తానికి జూబ్లీహిల్స్ ఓటర్లు ఇప్పుడు తటస్థంగా ఉన్నారు. టీడీపీ సానుభూతిపరులు ఎటువైపు వాలతారన్నది ఈ ఉపఎన్నిక ఫలితాలకే కాకుండా భవిష్యత్తు తెలంగాణ రాజకీయ సమీకరణాలకూ దిశ చూపనుంది.