న్యూస్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి పర్యటన రాజకీయ వేడి పెంచింది. మొదట రోడ్డు మార్గంలో పర్యటనకు అనుమతించలేమన్న పోలీసులు, రాత్రికి కొన్ని షరతులతో అనుమతి ఇచ్చారు.
అయితే వైసీపీ “అనుమతి అవసరం లేదు, సమాచారం ఇచ్చాం అంతే” అంటూ దూకుడుగా వ్యవహరించింది. జగన్ మాకవరపాలెం మెడికల్ కాలేజీని పరిశీలించేందుకు వెళ్తుండగా, విశాఖ నుంచి 63 కిలోమీటర్ల రూట్ మ్యాప్ ఖరారైంది.
భారీ జనసమీకరణ అవకాశం ఉందన్న కారణంతో అనకాపల్లి పోలీసులు హెలికాప్టర్ ప్రయాణానికే అనుమతి సూచించారు. చివరికి విశాఖ పోలీసులు షరతులతో రోడ్డు మార్గం అనుమతించారు.. పది వాహనాల కాన్వాయ్ మాత్రమే, ఊరేగింపులు, సభలు నిషేధం. ట్రాఫిక్ అంతరాయం కలిగితే పర్యటన రద్దు చేస్తామని హెచ్చరించారు.
వైసీపీ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. “మాకు పర్మిషన్‌తో పనిలేదు, జగన్ రోడ్‌షో తప్పదు” అని జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ప్రభుత్వానికి, పోలీసులకు సవాలుగా మారింది.
