
విజయ్ దేవరకొండ పక్కా తెలంగాణ వాసి. టాలీవుడ్‌లో అతడి సక్సెస్‌కు తెలంగాణ యాస కీలక పాత్ర పోషించింది. ‘పెళ్లి చూపులు’ సినిమాలో పక్కా తెలంగాణ స్లాంగ్ మాట్లాడి ఆంధ్రాలో కూడా ఫేమస్ అయిపోయాడు. ఆ తర్వాత చాలా సినిమాలకు ఆయన స్లాంగ్ వర్కౌట్ అయింది. అప్పటినుంచి తెలంగాణ స్టార్ అంటే విజయ్ మాత్రమే గుర్తొస్తారు.
ఆ సంగతి పక్కన పెడితే, తాజాగా విజయ్ దేవరకొండ ఇప్పుడు ఆంధ్రా స్లాంగ్ మాట్లాడబోతున్నాడా? స్వచ్ఛమైన గోదావరి కుర్రాడిలా అలరించనున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. విజయ్ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్దన్’ అనే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది.
టైటిల్‌ను బట్టి ఇది యాక్షన్ స్టోరీ అని, రాయలసీమ నేపథ్యం గల కథ అని ప్రచారం జరిగింది. కానీ ఇది పక్కా గోదావరి నేపథ్యం గల కథ అని తెలుస్తోంది. కోనసీమ ప్రాంతం నేపథ్యంతో సాగే ఓ పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఒక అందమైన ప్రేమకథ కూడా మిళితమై ఉంటుంది.
షూటింగ్ అంతా కూడా గోదారి ప్రాంతాలను తలపించేలా సెట్లు వేసి చిత్రీకరిస్తున్నారు. గోదారి కుర్రాడి పాత్రలో విజయ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాడు అన్నదే ఆసక్తికరం. ఏ నటుడైనా కొత్త యాసను మాట్లాడాలంటే సమయం పడుతుంది. ‘పుష్ప’ సినిమాలో బన్నీ చిత్తూరు మాండలికం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. మరి గోదావరి యాస కోసం విజయ్ ఎలాంటి హోం వర్క్ చేసాడో తెలియాల్సి ఉంది.
