
న్యూస్ డెస్క్: ప్రపంచ అథ్లెటిక్స్ లో దశాబ్దం పైగా ఆధిపత్యం చెలాయించిన ఉసేన్ బోల్ట్ పేరు ఎప్పటికీ మరిచిపోలేం. ఆయన ట్రాక్‌పై అడుగుపెడితే ప్రత్యర్థులు భయపడేవారు. ఎనిమిది ఒలింపిక్ బంగారు పతకాలు, పదకొండు ప్రపంచ టైటిల్స్ సాధించిన ఈ జమైకన్ స్ప్రింటర్ నిజంగా పరుగుల చిరుత.
అయితే రిటైర్మెంట్ తర్వాత బోల్ట్ జీవనశైలి పూర్తిగా మారిపోయింది. కుటుంబంతో సమయం గడుపుతూ, ఫిట్‌నెస్‌పై పెద్దగా దృష్టి పెట్టడం మానేశారు. తాను ఎక్కువగా వెబ్ సిరీస్‌లు చూస్తూ గడుపుతున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అదే సమయంలో పిల్లలతో కాసేపు ఆడుకుంటున్నానని, జిమ్ చేస్తానని కానీ అది సరిపడదని అంగీకరించారు. అందుకే తన శరీరంపై ప్రభావం పడిందని ఒప్పుకున్నారు.
తాజాగా ఆయన ఒకసారి మెట్లు ఎక్కే సమయంలోనే ఆయాసపడ్డానని చెప్పారు. ఇది తనకు పెద్ద షాక్‌గా అనిపించిందని బోల్ట్ తెలిపారు.
ప్రపంచ రికార్డులను బద్దలుకొట్టిన స్ప్రింటర్ ఇప్పుడు మళ్లీ పరుగు మొదలుపెట్టాలి అనిపిస్తోందని అన్నారు. ఫిట్‌నెస్‌ను తిరిగి సంపాదించుకోవాలని సంకల్పం వ్యక్తం చేశారు.
పరుగుల చిరుత ఇప్పుడు మెట్లు ఎక్కలేని స్థితికి చేరడం క్రీడాభిమానులకు బాధ కలిగిస్తోంది. కానీ మళ్లీ తనదైన శైలిలో ట్రాక్‌పై కనిపిస్తానని బోల్ట్ చెప్పిన మాటలు ఆశ కలిగిస్తున్నాయి.