
న్యూస్ డెస్క్: టీటీడీ రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ఆలయాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు వరకు ఆలయాలను నిర్మించాలని నిర్ణయించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులను వినియోగించి ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
మత మార్పిడులను అరికట్టే లక్ష్యంతో ఈ ఆలయాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఈ కీలక నిర్ణయాలను ప్రకటించారు.
ఇక ఈనెల 23 నుంచి అక్టోబర్ 2 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 24న మీన లగ్నంలో ధ్వజారోహణం ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
బ్రహ్మోత్సవాల సమయంలో పది రోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.
గరుడ సేవకు సుమారు 3 లక్షల మందికి పైగా భక్తులు హాజరు కానున్నారని అంచనా. చిన్నపిల్లల భద్రత కోసం తొలిసారిగా జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు.
అంతకుముందు శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్-2025ను టీటీడీ అధికారులు ఆవిష్కరించారు. ఈ ఉత్సవాల నిర్వహణను ఇస్రో శాస్త్రవేత్తలు కూడా పరిశీలించనున్నారు.