
‘టైటానిక్’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఆస్కార్ నటి కేట్ విన్స్‌లెట్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు. దశాబ్దాలుగా తన నటనతో అద్భుతాలు సృష్టించిన ఆమె, ఇప్పుడు దర్శకురాలిగా అరంగేట్రం చేస్తున్నారు.
కేట్ విన్స్‌లెట్ ‘గుడ్ బై జూన్’ (Goodbye June) అనే నెట్‌ఫ్లిక్స్ డ్రామాతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా కథను ఆమె కుమారుడు జో ఆండర్స్ రాయడం మరో విశేషం.
ఈ చిత్రంలో టోనీ కొల్లెట్, హెలెన్ మిర్రెన్ వంటి దిగ్గజ బ్రిటీష్ నటులు నటిస్తుండటంతో, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ‘లీ’ చిత్రానికి గానూ గోల్డెన్ గ్లోబ్, BAFTA నామినేషన్లు గెలుచుకున్న కేట్, ఇప్పుడు దర్శకురాలిగా తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో సాగే తోబుట్టువుల కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎమోషనల్ పాత్రలకు పెట్టింది పేరైన కేట్, ఈ డ్రామాను అంతే బలంగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ‘గుడ్ బై జూన్’ విజయం సాధిస్తే, భవిష్యత్తులో కేట్ విన్స్‌లెట్ నుంచి మరిన్ని చిత్రాలను ఆశించవచ్చు.
