
న్యూస్ డెస్క్: టెక్సాస్‌లో భారతీయుడి హత్య అమెరికా రాజకీయాలను కుదిపేసింది. డల్లాస్‌లో చందర్ నాగమల్లయ్య అనే 41 ఏళ్ల భారత సంతతి వ్యక్తిని క్యూబా అక్రమ వలసదారుడు మార్టినెజ్ దారుణంగా తలనరికి చంపాడు. ఈ సంఘటన అమెరికాలోని భారతీయ సమాజాన్ని షాక్‌కు గురిచేసింది.
ఈ ఘటన చిన్నపాటి గొడవ నుంచి ప్రారంభమైంది. హోటల్‌లో వాషింగ్ మెషీన్ విషయంలో వాదన చెలరేగి, మార్టినెజ్ కత్తితో నాగమల్లయ్యపై దాడి చేశాడు. భార్య, కుమారుడు కళ్లముందే అతడిని హత్య చేయడం మరింత విషాదకరం. నిందితుడు తలను చెత్తబుట్టలో పడేయడం క్రూరతకు నిదర్శనం.
మార్టినెజ్‌కు ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ గతంలో అతడిని ICE కస్టడీ నుంచి విడుదల చేయడంపై రాజకీయ విమర్శలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సభ్యులు, అధికారులు బైడెన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. నిందితుడిని వెంటనే అమెరికా నుంచి బహిష్కరించే చర్యలు ప్రారంభించనున్నట్లు ICE ప్రకటించింది. అయితే క్యూబా ప్రభుత్వం తిరిగి స్వీకరించకపోవడం సమస్యగా మారింది.
అమెరికాలోని భారతీయులు ఈ ఘటనతో ఆందోళనలో మునిగిపోయారు. తమ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వలస విధానాలపై కొత్త చర్చ మొదలైంది.
ఈ హత్యతో అమెరికాలో అక్రమ వలసలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.