
న్యూస్ డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, భారత్‌లో తన విస్తరణ వేగాన్ని పెంచింది. ముంబైలో తొలి షోరూమ్‌ను ప్రారంభించిన నెల రోజుల్లోనే, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో రెండో రిటైల్ సెంటర్‌ను ప్రారంభించింది.
సోమవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఏరోసిటీలోని వరల్డ్‌మార్క్ 3 కాంప్లెక్స్‌లో ఈ కొత్త షోరూమ్‌ను ప్రారంభించారు. ఇది కేవలం విక్రయ కేంద్రం మాత్రమే కాదు, కస్టమర్లు టెస్లా కార్లను అనుభవించగల ఎక్స్పీరియన్స్ సెంటర్‌గా తీర్చిదిద్దారు.
ప్రస్తుతం ప్రదర్శనకు టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ ఎస్యూవీ మాత్రమే ఉంది. కస్టమర్లు కారు ఫీచర్లు, చార్జింగ్ ఆప్షన్లు, కొనుగోలు విధానం వంటి వివరాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా ప్రాంతాల కస్టమర్లకు ఇది సౌకర్యం కల్పించనుంది.
టెస్లా మోడల్ వై రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు, లాంగ్ రేంజ్ వేరియంట్ ధర రూ. 67.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). జూలైలోనే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి, డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో మొదలుకానున్నాయి.
పనితీరులో స్టాండర్డ్ మోడల్ ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కిమీ, లాంగ్ రేంజ్ మోడల్ 622 కిమీ వరకు ప్రయాణిస్తుంది. గరిష్ఠ వేగం రెండింటికీ గంటకు 201 కిమీ. ఫాస్ట్ చార్జింగ్‌లో 15 నిమిషాల్లోనే స్టాండర్డ్ 238 కిమీ, లాంగ్ రేంజ్ 267 కిమీ రేంజ్ తిరిగి పొందగలదు.
ప్రస్తుతం టెస్లా దృష్టి రిటైల్ నెట్వర్క్ విస్తరణపైనే ఉంది. స్థానిక తయారీ యూనిట్ లేదా కొత్త మోడళ్ల విడుదలపై ఇంకా ప్రకటన చేయలేదు.