న్యూస్ డెస్క్: రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త అందింది. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌లో ఈ తొలి స్లీపర్ రైలు ప్రారంభమవుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇది భారత రైల్వే చరిత్రలో మరో కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.
ఇప్పటి వరకు వందేభారత్ రైళ్లు కేవలం డే చైర్‌కార్ మోడల్‌తో మాత్రమే ఉన్నాయి. అయితే, రాత్రి ప్రయాణాలకు అనువైన స్లీపర్ వర్షన్‌ను తొలిసారిగా ప్రవేశపెట్టనున్నారు. ఇది సౌకర్యవంతమైనది, వేగవంతమైన ప్రయాణానికి అనువైనదిగా అభివృద్ధి చేశారు.
ఈ స్లీపర్ రైళ్లలో ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ సెకండ్ టయర్, థర్డ్ టయర్ లాంటి వేరియెంట్లు ఉండనున్నాయి. మొత్తం 16 కోచ్‌లతో 1,128 మంది ప్రయాణికులు ప్రయాణించగలిగేలా రూపొందించారు.
గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్లు న్యూ ఢిల్లీ-సికింద్రాబాద్ సహా ప్రధాన రూట్లలో నడిపే యోచనలో రైల్వే శాఖ ఉంది.
అదే సమయంలో ముంబై అహ్మదాబాద్ మధ్య మొదటి బుల్లెట్ ట్రైన్ కూడా త్వరలో ప్రారంభమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ రైలు కేవలం 2 గంటల 7 నిమిషాల్లో 508 కిలోమీటర్ల దూరం చేరుతుంది. ఇది ప్రయాణ మార్గాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుంది.
రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం విషయంలోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోంది. ఇప్పటికే 1,300 స్టేషన్‌లను పునర్నిర్మాణం చేస్తున్నామని, ప్రతిరోజూ సగటున 12 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌లు వేసేలా వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోందని అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.
