న్యూస్ డెస్క్: ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రశ్నించే శక్తి ప్రతిపక్షం. ఇది బలహీనమైతే అధికార పక్షం ఎలాంటి నియంత్రణ లేకుండా ముందుకు వెళ్తుంది. అందుకే ప్రతిపక్ష పాత్ర ఎంత ముఖ్యమో చెప్పనవసరం లేదు.
తెలంగాణలో ఈ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్‌కు ఎదురుగా బీఆర్‌ఎస్, బీజేపీలు గట్టిగా పోరాడుతున్నాయి. మూడు పార్టీలు కూడా వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తూ, పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. దీంతో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా ఉంది.
అయితే ఏపీ చిత్రమే వేరుగా ఉంది. ఇక్కడ ప్రధాన పోటీ టీడీపీ వైసీపీ మధ్యే ఉన్నా, కూటమిలో జనసేన, బీజేపీలు అధికార పక్షంలో ఉండటంతో విపక్ష బలం తగ్గింది. వచ్చే ఎన్నికల కోసం టీడీపీ చురుకుగా పనిచేస్తున్నా, వైసీపీ మాత్రం ప్రతిపక్షంగా తగిన దూకుడు చూపడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్వతంత్ర సంస్థ చేసిన సర్వే ప్రకారం, జగన్ నాయకత్వంలోని వైసీపీ, 2014–19 మధ్యకాలంలో ఉన్న గళం ఇప్పుడు లేకుండా పోయింది. ప్రజల సమస్యలపై పెద్దగా స్పందించకపోవడం, పార్టీ అంతర్గత విషయాలకే పరిమితం కావడం ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.
కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఏపీ రాజకీయాల్లో ప్రాముఖ్యం కోల్పోవడంతో, బలమైన విపక్షంగా ఉండే అవకాశం పూర్తిగా వైసీపీదే. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వైఫల్యం చెందుతోందని విమర్శలు వస్తున్నాయి.
మొత్తానికి, ప్రతిపక్ష పోటీ తెలంగాణలో ఉత్కంఠగా నడుస్తుండగా, ఏపీలో మాత్రం ఒక్క వైసీపీకి ఉన్న అవకాశం కూడా సరిగా ఉపయోగం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
