
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ (SSMB29) కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఈ నిరీక్షణకు తెర దించుతూ, నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో హైప్ పెంచిన జక్కన్న, ఇప్పుడు ఈవెంట్‌తోనే సినిమా స్థాయిని చూపించబోతున్నారు.
సాధారణంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్లు చేస్తారు, కానీ రాజమౌళి స్టైలే వేరు. కేవలం టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ రివీల్ చేయడం కోసమే ఇంత భారీ ఈవెంట్ ప్లాన్ చేయడం భారతీయ సినిమాలో ఇదే తొలిసారి.
ఈ ఈవెంట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో వేస్తున్న సెటప్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఏకంగా 130 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తుతో భారీ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఓ సినిమా అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌కు ఇంత పెద్ద స్టేజ్ వేయడం ఇదే మొదటిసారి.
మరో రికార్డు ఏమిటంటే, ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను ‘జియో హాట్‌స్టార్’ భారీ మొత్తానికి దక్కించుకుంది. ఒక గ్లింప్స్ ఈవెంట్‌ను ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం చేయడం కూడా ఇదే ప్రథమం.
ప్రస్తుతం చిత్రబృందం క్లైమాక్స్ షూటింగ్‌లో బిజీగా ఉంది. హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా హైదరాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొన్నారు. గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్‌గా వస్తున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే జక్కన్న రికార్డుల వేట మొదలుపెట్టారు.
