
2026 సంక్రాంతి సీజన్, తెలుగు బాక్సాఫీస్ వద్ద పెను తుఫానుగా మారనుంది. గత కొన్నేళ్లతో పోలిస్తే, ఈసారి పోటీ అత్యంత తీవ్రంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’, మాస్ రాజా రవితేజ సినిమాతో పాటు, మరో రెండు డబ్బింగ్ చిత్రాలు, ఓ మీడియం రేంజ్ సినిమా పండగ బరిలో నిలుస్తున్నాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్‌లో భారీ అంచనాలున్నాయి. మరోవైపు, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ వాయిదా పడిందని రూమర్లు వచ్చినా, మేకర్స్ వాటిని ఖండించి, రేసులో ఉన్నామని స్పష్టం చేశారు. దీంతో ఈ రెండు భారీ చిత్రాల మధ్య ప్రత్యక్ష పోటీ ఖాయమైంది.
ఇన్ని సినిమాలు కేవలం వారం వ్యవధిలో విడుదల కావడం ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది. అన్ని చిత్రాలకు సరిపడా థియేటర్లు కేటాయించడం అసాధ్యం. దీనివల్ల ప్రేక్షకులు, కలెక్షన్లు తప్పనిసరిగా చీలిపోతాయి.
గత 2025 సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రానికి మంచి టాక్ వచ్చినా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పోటీ వల్ల కమర్షియల్‌గా నష్టపోయింది. 2026లో కూడా అదే పునరావృతమై, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా భారీ నష్టాలు చవిచూసే ప్రమాదం ఉంది.
ఈ పోటీలో ఏ ఒక్క సినిమా విజయం సాధించినా, మిగిలిన సినిమాలు ఆర్థికంగా దెబ్బతినడం ఖాయం. ఈ భారీ రద్దీ కారణంగా 2026 సంక్రాంతి, నిర్మాతలకు, బయ్యర్లకు లాభాల కంటే నష్టాలనే మిగిల్చేలా కనిపిస్తోంది.
