
మాస్ మహారాజా రవితేజ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నా, ఇటీవలి ఫలితాలు తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. ‘రావణాసుర’ నుంచి మొన్నటి ‘మాస్ జాతర’ వరకు, ఆయన మాస్ ఇమేజ్‌ను నమ్ముకున్న చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి.
ఈ నేపథ్యంలో, ఆయన తన తదుపరి చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (RT 76) విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి సెన్సిబుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు తీసే కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా టైటిల్ కార్డ్స్‌లో తన ‘మాస్ మహారాజా’ అనే బిరుదును వేయవద్దని రవితేజ దర్శకుడికి సూచించారట. కేవలం ‘రవితేజ’ అని వేస్తే చాలని చెప్పినట్లు తెలుస్తోంది.
వరుసగా మాస్ సినిమాలు ఫ్లాప్ అవుతుండటం, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఒక క్లీన్ ఫ్యామిలీ సబ్జెక్ట్ కావడంతో, ఆ ‘మాస్’ ట్యాగ్ సినిమా జానర్‌కు అడ్డుగా ఉంటుందని రవితేజ భావించి ఉండవచ్చు.
అయితే, ఈ నిర్ణయం కేవలం ఈ ఒక్క సినిమా వరకే పరిమితమా, లేక తన ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నంలో ఇది తొలి అడుగు మాత్రమేనా అనేది ఆసక్తికరంగా మారింది. వరుస ఫ్లాపుల నేపథ్యంలో, ఈ ‘ఫ్లాప్ సెంటిమెంట్’ను బ్రేక్ చేయడానికే రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
