
‘బాహుబలి’ త్రయం.. రాజమౌళి, ప్రభాస్, రానా. ఈ కాంబో మళ్లీ వస్తే చూడాలని ఇండియన్ సినిమా ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఆ కోరిక నెరవేరేలా కనిపిస్తోంది. ‘SSMB29’ (మహేష్ బాబు సినిమా) తర్వాత, జక్కన్న తన తదుపరి చిత్రం కోసం మళ్లీ ప్రభాస్‌నే సంప్రదించనున్నారని ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది.
ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ, ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ గతంలో చెప్పిన ఓ విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. రాజమౌళి ‘బాహుబలి’ కథ చెప్పినప్పుడే, దానికి ప్రత్యామ్నాయంగా మరో కథను కూడా సిద్ధం చేసుకున్నారట.
ఒకవేళ ‘బాహుబలి’ భారీ బడ్జెట్ చూసి నిర్మాతలు వెనక్కి తగ్గితే, వెంటనే ఓ బాక్సింగ్ నేపథ్యం ఉన్న కథను పట్టాలెక్కించాలని జక్కన్న ప్లాన్ చేశారు. ఆ కథ కూడా ప్రభాస్ హీరోగానే రాసుకున్నారట. ఇప్పుడు ఆ స్క్రిప్ట్‌ను రాజమౌళి భద్రంగా దాచిపెట్టారని సమాచారం.
‘బాహుబలి’ పట్టాలెక్కడంతో ఆ బాక్సింగ్ కథ పక్కకు వెళ్లింది. ఇప్పుడు మహేష్ సినిమా తర్వాత, జక్కన్న ఆ పాత స్క్రిప్ట్‌నే మళ్లీ బయటకు తీస్తారని అంటున్నారు. బాక్సింగ్ కథకు ప్రభాస్ కటౌట్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.
అంతేకాదు, ప్రభాస్‌కు ధీటైన ప్రతినాయకుడిగా రానాను మించిన ఆప్షన్ ఉండదు. కాబట్టి, ఆ బాక్సింగ్ డ్రామాలో భళ్లాలదేవుడినే (రానా) మళ్లీ విలన్‌గా దించే అవకాశం ఉంది. ఈ వార్త నిజమైతే, ‘బాహుబలి’ కాంబో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం.
