
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, తన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (నవంబర్ 7 విడుదల) ప్రమోషన్లలో భాగంగా, జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో సందడి చేశారు. ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
షోలో భాగంగా జగపతిబాబు, రష్మిక వ్యక్తిగత విషయాలపై సరదాగా ప్రశ్నలు సంధించారు. “మీ క్రష్ ఎవరు?” అని జగ్గూభాయ్ సూటిగా అడగ్గా, రష్మిక తెలివిగా ప్రేక్షకులను ఉద్దేశించి, “మీలో ‘విజయ్’ అనే పేరున్న వారు ఎవరైనా ఉన్నారా?” అని నవ్వేశారు. ఈ కామెంట్ విజయ్ దేవరకొండను ఉద్దేశించేనని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
అంతటితో ఆగకుండా, “నన్ను కలవాలంటే జిమ్‌కు రండి” అని రష్మిక చెప్పారు. “ఏ జిమ్‌కో చెప్పడం లేదు” అని జగపతిబాబు అనగా, “త్వరలో నేనే ‘రౌడీ జిమ్’ స్టార్ట్ చేస్తా, నేనే ట్రైనర్‌గా ఉంటా” అంటూ రష్మిక మరో పంచ్ వేశారు.
“చివరిగా ఎవరికి మెసేజ్ చేశారు?” అని అడిగిన ప్రశ్నకు కూడా ఆమె “తర్వాత మాట్లాడుకుందాం” అంటూ సమాధానం దాటవేశారు. ప్రోమోనే ఇంత సరదాగా ఉండటంతో, పూర్తి ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
