
ప్రస్తుతం టాలీవుడ్‌లో సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ల ట్రెండ్ నడుస్తోంది. ఈ జానర్లో వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో, చాలా మంది హీరోలు సేఫ్ గేమ్‌గా ఆ ట్రెండ్‌నే ఫాలో అవుతున్నారు. కానీ, యంగ్ హీరో సుధీర్ బాబు మాత్రం తాను ఈ లెక్కలను పట్టించుకోనని స్పష్టం చేశారు.
ఆయన హీరోగా నటించిన ‘జటాధర’ నవంబర్ 7న విడుదల కానుంది. ఇది కూడా ఒక సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ కావడం గమనార్హం. ప్రస్తుతం హారర్ ట్రెండ్ నడుస్తున్న సమయంలోనే ఈ సినిమా రావడం కేవలం యాదృచ్ఛికమే తప్ప, కావాలని చేసింది కాదని సుధీర్ బాబు అన్నారు.
‘జటాధర’ ప్రాజెక్ట్ ఎలా మొదలైందో ఆయన వివరిస్తూ, ఈ చిత్ర నిర్మాతలు తన వద్దకు మొదట వేరే కథతో వచ్చారని తెలిపారు. అది నచ్చకపోవడంతో, తన దగ్గర ఉన్న ఈ కథను చెప్పగా, వారికి నచ్చి సినిమా ప్రారంభమైందని అన్నారు.
ట్రెండ్స్ ఆధారంగా సినిమాలు చేయడం సరైన ఆలోచన కాదని ఆయన అభిప్రాయపడ్డారు. “ట్రెండ్ అనేది ఈ రోజు ఎలా ఉందో చెబుతుంది, కానీ రేపు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. దాన్ని నమ్ముకుని సినిమా ఎలా చేస్తాం?” అని ఆయన ప్రశ్నించారు.
తన కెరీర్‌లో ఎప్పుడూ ట్రెండ్స్ ఆధారంగా కాకుండా, కథను నమ్మి మాత్రమే సినిమాలు చేశానని సుధీర్ బాబు తెలిపారు. ‘జటాధర’ కథలోని లంకె బిందెలు, పిశాచి బంధనం వంటి అంశాలు ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
