
న్యూస్ డెస్క్: దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తల యుగానికి శ్రీకారం చుట్టిన ప్రశాంత్ కిశోర్ (PK) ఇప్పుడు కొత్త చర్చకు దారితీశారు. వ్యూహకర్తగా ఆయన ఐప్యాక్ ద్వారా ఎన్నో పార్టీలకు విజయాలు అందించినా, ఆయన టీం లోని వ్యక్తుల ప్రవర్తనపై విమర్శలు మళ్లీ మిన్నంటుతున్నాయి.
పీకే తన డేటా ఆధారిత రాజకీయ వ్యూహాలతో అనేక నేతలను సీఎం కుర్చీకి చేర్చాడనే పేరుంది. అయితే ఆయన రాజకీయాల నుంచి దూరమైన తర్వాత, ఆయన శిష్యులు స్వతంత్రంగా పనిచేస్తూ తప్పు దిశలో సలహాలు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ముఖ్యంగా వైసీపీ పాలనలో పీకే టీం మాజీ సభ్యుడు రిషి రాజ్ సింగ్ కీలకంగా వ్యవహరించాడని, కానీ వాస్తవాలు చెప్పకుండా జగన్ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైసీపీ వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ, అంతా బాగుందని తప్పుదారి పట్టించడం వల్లే పార్టీ భారీ దెబ్బ తిన్నదని వర్గాలు చెబుతున్నాయి.
దీంతో “పీకే బ్రాండ్” పేరుతో పనిచేసే టీంలు నిజంగా వ్యూహకర్తలా, లేక ఆర్థిక ప్రయోజనాలకే కట్టుబడి ఉన్నారా?” అనే ప్రశ్న రాజకీయంగా మారింది. వైసీపీ భవిష్యత్తు కోసం ఇలాంటి టీంలను పక్కన పెట్టాలని సీనియర్ నాయకులు సూచిస్తున్నారు.