
న్యూస్ డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించామని ప్రకటించింది. యూనిట్‌కు 13 పైసలు తగ్గించామని చెబుతుండగా, ఈ నిర్ణయం అసలు ఎంతవరకు ప్రజలకు లాభదాయకమో అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
ప్రకటనలో సీఎం, మంత్రులు చెప్పినట్లు ఇది ప్రజలకు పెద్ద ఊరటనిస్తుందని ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఒక కుటుంబం నెలకు 300 యూనిట్లు వినియోగిస్తే లాభం కేవలం రూ.32 మాత్రమే వస్తుంది. దీంతో ఇది కేవలం చిన్న ఉపశమనం మాత్రమేనని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అంతేకాకుండా ప్రతిపక్షం ఈ తగ్గింపు తమకేమీ సంబంధం లేదని వాదిస్తోంది. ఇది విద్యుత్ నియంత్రణ మండలి (ERC) నిర్ణయం మాత్రమేనని వారు ఆధారాలతో చెబుతున్నారు. పాలనలో ఎవరున్నా పెంచడమే తప్ప నిజమైన తగ్గింపులు జరగలేదని కూడా నిపుణుల వాదన.
సోషల్ మీడియాలో కూడా చర్చలు రగులుతున్నాయి. కొందరు ఈ తగ్గింపు ఎలక్షన్ స్ట్రాటజీ అని అంటుంటే, మరికొందరు కనీసం చిన్న తగ్గింపైనా మంచి సంకేతమని భావిస్తున్నారు.
విద్యుత్ రంగ నిపుణులు మాత్రం దీన్ని కంటితుడుపు చర్యగా భావిస్తున్నారు. నిజంగా ప్రజలకు ఉపశమనం కలిగించాలంటే గణనీయంగా ఛార్జీలను తగ్గించాలి అని సూచిస్తున్నారు.
ఇక రాజకీయంగా చూస్తే, కూటమి ఈ ప్రకటనను తమ క్రెడిట్‌గా చూపించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ప్రతిపక్షం ప్రజల్లో ఇది ప్రభావం చూపనీయకుండా కౌంటర్లు ఇస్తోంది. ఫలితంగా విద్యుత్ అనే అంశం మరోసారి రాజకీయ వేడుకే అయ్యింది.
