
తెలంగాణ: తీవ్ర చర్చకు దారితీసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు మరింత ఊపందుకుంది. ఈ కేసులో తాజాగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జీఎడీ పొలిటికల్ కార్యదర్శి రఘునందన్ రావులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు విచారించారు.
వారిద్దరి వాంగ్మూలాలను నమోదు చేసిన సిట్, ట్యాపింగ్‌కు సంబంధించిన అనుమతుల ప్రక్రియపై కీలక సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం, ఫోన్ ట్యాపింగ్‌కు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ అనుమతి అవసరం. అంతేకాక, డాట్ నుంచి కూడా క్లీన్ చిట్ అవసరం ఉంటుంది.
వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో 618 నెంబర్ల జాబితా రూపొందించబడినట్లు తెలుస్తోంది. ఆ జాబితా మొదట రివ్యూ కమిటీకి పంపించి, ఆమోదం తీసుకున్న తర్వాతే శాంతి కుమారి డాట్‌కు అనుమతుల కోసం పంపినట్లు వెల్లడైంది.
ఇంత పెద్ద సంఖ్యలో ట్యాపింగ్ కోసం ప్రభుత్వ ముక్యస్థాయిల నుంచే ఏర్పాట్లు చేయడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అధికారిక ప్రమాణాలను ఎలా దాటి అనుమతులు పొందారు? అనేది సిట్ విచారణలో ప్రధాన అంశంగా మారింది.
ఈ కేసులో మరిన్ని పేర్లు బయట పడే అవకాశముండగా, ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏ మేరకు రాజకీయ లబ్ధి పొందాలని చూశారు? అన్న దానిపై దర్యాప్తు మరింత లోతుగా కొనసాగనుంది.