
ఇలాంటి ఆపరేషన్ల విజయాల్లో చిన్న విషయాల్ని పట్టించుకోవద్దు
న్యూస్ డెస్క్: పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీసుకుంది. మే 7న జరిగిన ఆపరేషన్ సిందూర్ భారత రక్షణ శక్తిని మరోసారి ప్రపంచానికి చూపించింది. ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఇంత భారీ విజయాన్ని సాధించిన సమయంలో చిన్నచిన్న విషయాలపై దృష్టిపెట్టడం అవసరం లేదని స్పష్టం చేశారు.
పాక్‌కు ఇది గట్టి హెచ్చరికగా నిలుస్తుందని, భద్రతా పరంగా దేశం ఎల్లప్పుడూ సజాగ్రత్తగా ఉందని వివరించారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం సైనిక స్థావరాలు ఉధంపూర్, భుజ్ లలోకి వెళ్లిన రాజ్‌నాథ్ అక్కడ సైనికులతో మాట్లాడారు.
వారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. విపక్షాలు తరచూ భారత సైన్యాన్ని తక్కువ చేస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. దేశ భద్రతే ప్రాధాన్యం కాబట్టి ఇలాంటి సందర్భాల్లో అన్ని రాజకీయ విమర్శలకు తగిన సమాధానం ఉంటుందన్నది ఆయన అభిప్రాయం.
ఇలాంటి అపరేషన్లు జరిగినప్పుడు విజయం మొత్తం దేశానికి చెందుతుందని, వ్యక్తిగత ఆరోపణలు, చిన్నపాటి తప్పిదాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం లేదని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. భారత సైన్యం ప్రతిసారి తన నిబద్ధతను నిరూపించుకుంటూ ముందుకెళ్తుందని తెలిపారు.
ఇక భద్రతా పరంగా భారత్ కొనసాగిస్తున్న అప్రమత్తతను ప్రపంచం గుర్తించాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. దేశ రక్షణ విషయంలో రాజకీయ దురుద్దేశాలు చోటుచేసుకోకూడదని ఆయన వ్యాఖ్యానించారు.
