
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమా చుట్టూ సస్పెన్స్ పెరుగుతూనే ఉంది. నాని జడల్ లుక్ రివీల్ వీడియో ఇప్పటికే ప్రేక్షకుల్లో కుతూహలం రేపింది. కానీ హీరోయిన్ ఎవరన్నది మాత్రం మేకర్స్ ఇంకా రహస్యంగానే ఉంచుతున్నారు.
ఈ సినిమాలో విలన్ పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారని టాక్. ఆయన కెరీర్ మొదలు విలన్ గానే మొదలై, ఇప్పుడు మళ్లీ గ్రే షేడ్స్ తో స్క్రీన్ పైకి వస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఈ యాంగిల్ ప్యారడైజ్ సినిమాకు స్పెషల్ హైలైట్ కానుంది.
అయితే హీరోయిన్ విషయంలో మాత్రం టీమ్ చాలా జాగ్రత్తగా ఉంది. దసరా కాంబినేషన్ కాబట్టి మళ్లీ కీర్తి సురేష్ పేరు వినిపించినా, అది నిజమా కాదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. మరొక కొత్త ముఖం లేదా బాలీవుడ్ నుంచి ఓ స్టార్ హీరోయిన్ వచ్చే అవకాశం కూడా ఉందనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.
నాని వరుస విజయాలతో దూసుకెళ్తుండగా, ప్యారడైజ్ సినిమాను మాస్ అప్పీల్ తో తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ఇందులో నాని ఊహించని లుక్ తో, పవర్‌ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించనున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ కి కూడా మంచి స్కోప్ ఉందని అంటున్నారు.
2026 మార్చి 24న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ చేశారు. భారీ బడ్జెట్‌తో ఎస్.ఎల్.వి సినిమాస్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ కానుంది.
