
న్యూస్ డెస్క్: జమ్మూకశ్మీర్ లోని దాచిగామ్ అడవుల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగించాయి. ఇటీవల పహల్గామ్ లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కదలికలపై సమాచారం రాగానే, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించారు. దాచిగామ్ ప్రాంతాన్ని చుట్టుముట్టిన వెంటనే ఉగ్రవాదులు కాల్పులకు దిగారు.
ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీస్ సంయుక్తంగా ఎదురుకాల్పులు జరిపారు. సమీప ప్రాంతాల్లో మోహరించిన బలగాలు అప్రమత్తంగా వ్యవహరించాయి. ఉగ్రవాదులను కదలికలేని స్థితిలోకి తెచ్చేందుకు భారీగా సెర్చ్ ఆపరేషన్స్ సాగించాయి.
ఇప్పటికే ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్టు సమాచారం. వీరిలో పహల్గామ్ దాడికి ప్రధాన నిందితులు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. ఇదే విషయాన్ని అధికారికంగా భద్రతా శాఖలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
ఈ ఎన్ కౌంటర్ ఘటన నేపథ్యంలో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పరిసర ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు, హెలికాప్టర్ ద్వారా మౌనిటరింగ్ బలోపేతం చేశారు. ఎలాంటి అనుకోని పరిణామాలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.
పార్లమెంటులో ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ జరుగుతుండగా, గ్రౌండ్ లో ఇలా ఎన్ కౌంటర్ కొనసాగుతుండటం తీవ్ర ఆసక్తికి కారణమైంది. ప్రభుత్వ వర్గాలు, భద్రతా సంస్థలు ఈ అంశంపై పూర్తి సమాచారాన్ని త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.