ఓజీ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే అభిమానులు డీకోడ్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. అందులో ఎక్కువగా చర్చనీయాంశం అయినది “సాహో కనెక్షన్” గురించే. ట్రైలర్‌లో కనిపించిన వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ బోర్డు చూసి, ఇది సాహోలోని మాఫియా నగరానికి లింక్ అని అభిమానులు థియరీలు అల్లడం మొదలుపెట్టారు.
కొంతమంది అయితే ఏకంగా ప్రభాస్ క్యామియో ఉంటుందని సోషల్ మీడియాలో రూమర్లు క్రియేట్ చేశారు. అయితే నిజానికి ఆ లింక్ అంతగా ఉండదనే సమాచారం బయటకు వచ్చింది. దర్శకుడు సుజీత్ వాజీ అనే పేరును యాదృచ్ఛికంగానే వాడాడని, దానికి మించి ఎలాంటి ఉద్దేశం లేదని చెబుతున్నారు.
ప్రాక్టికల్‌గా చూస్తే కూడా కనెక్షన్ అసాధ్యం. ఓజీ కథ 1980–90 మధ్య ముంబై (అప్పటి బొంబాయి) నేపథ్యంలో జరుగుతుంది. కాస్ట్యూమ్స్, లొకేషన్స్ అన్నీ అదే టైమ్‌లైన్‌కు తగినట్టే ఉన్నాయి. కానీ సాహో మాత్రం ప్రస్తుత కాలంలో సెట్ చేసిన యాక్షన్ డ్రామా. కాబట్టి టైమ్‌లైన్‌లు కలవవు.
గతంలో కూలీ సినిమాకి కూడా రకరకాల ఫ్యాన్ థియరీలు వచ్చాయి. కానీ రిలీజ్ అయ్యాక వాటిలో ఏ ఒక్కటి నిజం కాలేదు. ఓజీ విషయంలో కూడా అలాంటిదే జరగనుంది.
సుజీత్ యూనివర్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశం లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్‌గా ఆయనను మాస్, వైలెంట్ లుక్‌లో ఎలివేట్ చేయడమే ప్రధాన లక్ష్యం. అందుకే ఓజీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇక ట్రైలర్ రిస్పాన్స్ చూస్తేనే క్లియర్ అవుతోంది. నిమిషాల వ్యవధిలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కావడం ఫ్యాన్స్ ఎంత హైప్‌లో ఉన్నారో చూపిస్తోంది. కాబట్టి సాహో కనెక్షన్ కాకుండా, పవన్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌నే థియేటర్లలో భారీ ఫెస్టివల్‌గా ఎంజాయ్ చేయబోతున్నారు.