
న్యూస్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనడానికి చైనాలోని టియాన్జిన్ నగరానికి చేరుకున్నారు. ఏడేళ్ల విరామం తర్వాత ఆయన చైనాలో అడుగుపెట్టడం గమనార్హం. చైనా ప్రభుత్వం మోదీకి ఘన స్వాగతం పలికింది.
ఇటీవల అమెరికా భారత్‌పై 50 శాతం సుంకాలు విధించడం, ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతులపై 25 శాతం సుంకం అమలు చేయడం పెద్ద వివాదంగా మారింది. ఈ పరిస్థితుల్లో మోదీ పర్యటనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఏర్పడింది. ప్రపంచ దేశాలు భారత్-చైనా సంబంధాల దిశపై దృష్టి పెట్టాయి.
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు మోదీ ఈ పర్యటన చేస్తున్నారు. సదస్సులో ఆయన జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కూడా ప్రత్యేకంగా కలవనున్నారు. ఇతర దేశాల నాయకులతోనూ సమావేశం అవుతారని సమాచారం.
ప్రస్తుతం వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, మోదీ ఈ చర్చల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటారని అంచనాలు ఉన్నాయి. చమురు, రక్షణ, వాణిజ్య సంబంధాలు ప్రధాన చర్చా అంశాలుగా మారే అవకాశం ఉంది.
జపాన్ పర్యటన ముగిసిన వెంటనే మోదీ నేరుగా చైనాకు చేరుకోవడం, ఈ సదస్సుకు భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యాన్ని చూపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ చర్చల ఫలితాలు భారత్-చైనా సంబంధాలకు కీలకంగా మారవచ్చు.