
న్యూస్ డెస్క్: మహారాష్ట్ర పూణేకి చెందిన కాశిష్ మోత్వానీ 2023లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. అందమైన మోడల్‌గా పేరుతెచ్చుకున్న ఈమె, గ్లామర్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని వదిలి ఆర్మీ ఆఫీసర్‌గా మారి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
తన కెరీర్‌లో కీలక మలుపు తీసుకున్న కాశిష్, 2024లో జరిగిన సీడీఎస్ పరీక్షలో ఆల్ ఇండియా రెండో ర్యాంకు సాధించింది. ప్రస్తుతం ఆమె ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ విభాగంలో సేవలందిస్తున్నారు. ఈ నిర్ణయం ఆమెకు పేరు మాత్రమే కాక గౌరవం కూడా తెచ్చింది.
బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేసి, హార్వర్డ్‌లో పిహెచ్డీ అవకాశం వచ్చినా, దేశసేవ కోసం ఆర్మీని ఎంచుకోవడం ఆమె నిజమైన దేశభక్తిని చూపించింది. మోడలింగ్, సినిమాల ప్రపంచాన్ని వదిలి సైన్యంలో చేరడం అరుదైన ఉదాహరణ.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, “ఒక్క రంగంలో కాకుండా, అన్ని రంగాల్లో రాణించాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. చివరికి ఆర్మీనే సరైన మార్గం అనిపించింది” అని ఆమె వ్యాఖ్యానించారు.
చిన్నప్పటి నుంచే పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపిన కాశిష్, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగింది. ఇప్పుడు ఆమె అందం, ప్రతిభతో పాటు త్యాగంతో కూడా గుర్తింపు పొందుతున్నారు.
మొత్తానికి మిస్ ఇండియా నుంచి ఆర్మీ ఆఫీసర్‌గా మారిన కాశిష్ మోత్వానీ, మహిళలకు, యువతకు కొత్త ప్రేరణగా నిలుస్తున్నారు.