
న్యూస్ డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లో ‘జాగృతి జనం బాట’ యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన కవిత, అందులో కేసీఆర్ ఫొటోను ఉపయోగించలేదు.
తమ దారులు వేరైనప్పుడు ఆయన ఫొటోను ఉపయోగించడం సముచితం కాదని భావించినట్లు ఆమె తెలిపారు. ఈ యాత్ర నాలుగు నెలల పాటు కొనసాగనుంది.
సామాజిక చైతన్యం కోసమే ఈ యాత్ర అని ఆమె స్పష్టం చేశారు. ఈ యాత్రలో భాగంగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు తెలివైనవారని, వారికి అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుందని కవిత అన్నారు. యువత, మహిళలను మరింత చైతన్యవంతులను చేస్తామని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తనపై కుట్ర చేసి బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించారని సంచలన ఆరోపణ చేశారు. తాను సామాజిక తెలంగాణ కోసం నిలబడినందుకే తనపై కుట్రలు జరిగాయని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలని పిలుపునివ్వడం తప్పా అని ఆమె ప్రశ్నించారు.
‘జాగృతి జనం బాట’ పోస్టర్‌పై తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రాలు మాత్రమే ఉన్నాయి. భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ, సామాజిక తెలంగాణను ఇంకా సాధించలేకపోయామని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయని అనేకమంది ప్రాణత్యాగాలు చేశారు. ఆ లక్ష్యం ఇంకా నెరవేరలేదనే ఉద్దేశంతోనే కవిత ఈ కొత్త యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో తన ఉనికిని చాటుకోవాలని ఆమె చూస్తున్నారు.
