
న్యూస్ డెస్క్: తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో సినీనటుడు, టీవీకే అధినేత విజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 41 మంది మృతి చెందిన విషాదానికి విజయ్‌ను, ఆయన తమిళగ వెట్రీ కజగంను బాధ్యులుగా అభివర్ణించారు. టీవీకే షెడ్యూలింగ్‌లో జరిగిన తీవ్ర లోపాల వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని సీఎం ఆరోపించారు.
మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని పోలీసులకు చెప్పినా, విజయ్ మాత్రం చివరికి రాత్రి ఏడు గంటల తర్వాత వచ్చారు. దీంతో జనం గుమిగూడి, అతని బస్సును నిలిపివేయడం తొక్కిసలాటకు ముఖ్యకారణమైందని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. తాగునీరు, మహిళలకు బాత్రూమ్‌లు వంటి ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు చేయడంలోనూ పార్టీ విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
మరోవైపు, కరూర్ దుర్ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన టీవీకే కీలక నేతలు.. పార్టీ అధ్యక్షుడు విజయ్‌తో భేటీ అయినట్లు కథనాలు వస్తున్నాయి. పోలీసులు అరెస్టు చేయడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా, పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్‌లు వేర్వేరుగా విజయ్‌ను కలిసి, చర్చించినట్లు తెలుస్తోంది.
బుస్సీ ఆనంద్ ఈ భేటీ తర్వాత ఈసీఆర్ మార్గంగా పుదుచ్చేరి వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ కీలక పరిణామాల మధ్యే, కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తును సీబీఐకు మార్చుతూ సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
విజయ్ ఇప్పటికే మృతి చెందినవారి కుటుంబాలకు తలా రూ. 20 లక్షలు, గాయపడినవారికి రూ. 2 లక్షల చొప్పున అందజేస్తానని ప్రకటించారు. అంతేకాకుండా, మృతుల కుటుంబాలకు నెల నెలా రూ. 5 వేల ఆర్థికసాయం అందిస్తామని టీవీకే నిర్వాహకుడు మరియ విల్సన్ తెలిపారు.
