
న్యూస్ డెస్క్: టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిచి భారత్ టీ20 సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ దక్షిణాఫ్రికాను 101 పరుగుల భారీ తేడాతో ఓడించింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలో గట్టి షాక్ తగిలింది. శుభ్‌మన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ త్వరగా పెవిలియన్ చేరారు. కష్టాల్లో ఉన్న జట్టును హార్దిక్ పాండ్యా ఆదుకున్నాడు. ఆఖర్లో విశ్వరూపం చూపించిన హార్దిక్, కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్ (23) కూడా మెరవడంతో భారత్ 20 ఓవర్లలో 175 పరుగుల మంచి స్కోరు సాధించింది.
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా భారత బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ డకౌట్ అవ్వగా, స్టార్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. డెవాల్డ్ బ్రెవిస్ (22) ఒక్కడే కాస్త పోరాడాడు. సఫారీ జట్టు 12.3 ఓవర్లలోనే కేవలం 74 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
భారత బౌలర్లు సమిష్టిగా రాణించి వికెట్ల పండగ చేసుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్ (2/14), జస్ప్రీత్ బుమ్రా (2/17), స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (2/19), అక్షర్ పటేల్ (2/7) తలో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కోలుకోనీయలేదు. శివమ్ దూబే హార్దిక్ పాండ్యా కూడా చెరో వికెట్ పడగొట్టారు.
ముఖ్యంగా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ (1 వికెట్) రానించి ఆల్ రౌండర్ షోతో అదరగొట్టాడు. కష్టమైన పిచ్‌పై హార్దిక్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఇదే జోరు కొనసాగితే టీ20 సిరీస్ కూడా భారత్ ఖాతాలో చేరడం ఖాయం.
