
న్యూస్ డెస్క్: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత పర్యటన, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రి పదవి పోయేందుకు పరోక్ష కారణంగా మారింది. ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన మెస్సీ కార్యక్రమం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ రాష్ట్ర క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ తన పదవికి రాజీనామా చేశారు.
శనివారం జరిగిన ఈ కార్యక్రమం రెండు గంటలు సాగాల్సి ఉండగా, కేవలం 22 నిమిషాలకే ముగియడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీల ధ్వంసం, వాటర్ బాటిళ్లు విసిరేయడంతో అక్కడ విధ్వంసం జరిగింది. సీఎం మమతా బెనర్జీ సైతం దీనిపై అసహనం వ్యక్తం చేశారు. అదే రోజు హైదరాబాద్‌లో మెస్సీ టూర్ విజయవంతం కాగా, కోల్‌కతాలో మాత్రం ఇబ్బందులు తలెత్తాయి.
సాల్ట్ లేక్ స్టేడియం ఉదంతంపై తనపై విమర్శలు వస్తుండటంతో, అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. దర్యాప్తు సజావుగా సాగేందుకు వీలుగా రాజీనామా చేస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీకి లేఖ పంపారు. ఈవెంట్ ఆర్గనైజర్ శతద్రు దత్తా సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. శతద్రుకు 14 రోజుల పోలీస్ కస్టడీ విధించారు.
మెస్సీని చుట్టుముట్టిన వీఐపీల్లో ఒకరి పెన్ను తగలడం వల్లే ఆయన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని మరో కారణం వినిపిస్తోంది. భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని సహాయకులు భావించడంతోనే మెస్సీ వెళ్లిపోయారని పేర్కొంటున్నారు. అయితే, మెస్సీదే తప్పు అని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ విశ్లేషించారు. సీఎం మమతా బెనర్జీ మంత్రి రాజీనామాను ఆమోదించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు.
