
అమెరికా: ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత వీసా ఆంక్షలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ సమయంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హెచ్-1బీ వీసాలు వలస విధానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. అపార ప్రతిభ గల భారతీయులను నియమించుకొని కొన్నేళ్లుగా అమెరికా చాలా ప్రయోజనాలు పొందిందని మస్క్ అన్నారు.
అయితే, ప్రతిభావంతులను నియమించుకునేందుకు తీసుకొచ్చిన హెచ్-1బీ వీసా దుర్వినియోగం ఇటీవల అమెరికాలో పెరుగుతున్న వలస వ్యతిరేక భావనకు కొంతమేర కారణమైనట్లు మస్క్ అభిప్రాయపడ్డారు. దీనికి గత ప్రభుత్వాల అలసత్వమే కారణమన్నారు.
ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనపై మస్క్ విమర్శలు చేశారు. బైడెన్ పాలనలో సరిహద్దుల్లో ఎలాంటి నియంత్రణ లేకపోవడం అక్రమ వలసలకు దారితీసిందని, ఇది వలస వ్యతిరేక భావన పెరగడానికి కారణమైందని మస్క్ అన్నారు.
కొన్ని ఔట్‌సోర్సింగ్ కంపెనీలు తక్కువ జీతానికి ఉద్యోగులను నియమించుకునేందుకు హెచ్-1బీ వ్యవస్థను దెబ్బతీశాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవస్థను అరికట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
అయితే, తాను హెచ్-1బీ వీసాలను ఆపేయాలని కోరుకోవడం లేదని, ఈ కార్యక్రమానికి తాను ఇప్పటికీ మద్దతు ఇస్తున్నానని మస్క్ వివరించారు. తన కంపెనీలు ప్రతిభావంతులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయని ఆయన తేల్చిచెప్పారు.
