
న్యూస్ డెస్క్: అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన హెచ్-1బీ వీసా కొత్త నియమాలు ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగుల్లో కలకలం రేపాయి. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి $100,000 (దాదాపు ₹83 లక్షలు) ఫీజు తప్పనిసరి అవుతుందని చెప్పడంతో భారతీయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
కానీ తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం వైద్యులకు మాత్రం కొంత మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి సిద్ధమవుతున్న డాక్టర్లకు ఈ భారీ ఫీజు నుంచి ప్రత్యేక సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
కోనార్డ్ 30 వీవర్ ప్రోగ్రామ్ కింద ఇప్పటికే జె-1 వైద్యులకు తిప్పుదల మినహాయింపు ఉంది. ఇప్పుడు హెచ్-1బీ కొత్త రూల్స్ లోనూ అదే తరహా వెసులుబాటు ఉండబోతోందని అంచనా. రూరల్ హెల్త్ సెంటర్స్ లో సేవలు అందించే వైద్యులను జాతీయ ప్రయోజనంగా పరిగణించి ఈ సడలింపుని అమలు చేయాలని హోంల్యాండ్ సెక్యూరిటీ ఆలోచిస్తోంది.
అమెరికాలో గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ల కొరత ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మినహాయింపు ద్వారా ఆ సమస్యను తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు. నర్సులు, ఆరోగ్య సిబ్బందికి కూడా ఇలాంటి వెసులుబాట్లు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. వైట్ హౌస్ నుంచి క్లియర్ గైడ్లైన్స్ రాగానే పూర్తి స్పష్టత వస్తుంది. అప్పటి వరకు అన్ని హెచ్-1బీ దరఖాస్తులకు భారీ ఫీజు వర్తిస్తూనే ఉంటుంది.
ఈ సానుకూల సంకేతాలు అమెరికాలో పనిచేయాలనుకుంటున్న భారతీయ వైద్యులకు కొంత ఊరట ఇస్తున్నాయి. గ్రామీణ ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి ఈ కొత్త నిర్ణయం మైలురాయిగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
