
న్యూస్ డెస్క్: రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఒక్కో నిర్ణయం ద్వారా ప్రజల మద్దతు సంపాదిస్తోంది. తాజాగా సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ విషయంలో పెద్ద విజయాన్ని సాధించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఎన్ ఓసీని పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ ఇచ్చేందుకు అంగీకరించింది.
తెలంగాణ నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయిని కలిశారు. నీట మునిగే భూభాగానికి పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సిద్ధమని హామీ ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకి తొలగిపోయింది.
సమ్మక్క సాగర్ పూర్తైతే వరంగల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు తాగునీరు, సాగునీరు లభిస్తుంది. కొత్తగా 12 వేల ఎకరాల భూమికి సాగునీరు అందుతుంది.
ఈ ప్రాజెక్టు 6.7 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించబడుతోంది. 90 కిలోమీటర్ల టన్నెల్ నెట్‌వర్క్, మూడు పంప్ హౌసులు, భారీ ఇంజనీరింగ్ డిజైన్ ప్రధాన ఆకర్షణలు.
ఛత్తీస్‌గఢ్‌లో 73 హెక్టార్ల భూభాగం నీట మునిగే అవకాశం ఉండడంతో పరిహారం, పునరావాస బాధ్యతలు తెలంగాణ తీసుకోవడానికి అంగీకరించింది.
రెండు రాష్ట్రాల మధ్య సమన్వయంతో రేవంత్ సర్కారు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ ప్రాజెక్ట్ అమలు అయితే తెలంగాణలో నీటి సమస్యలకు పెద్ద ఉపశమనం లభించనుంది.
