
న్యూస్ డెస్క్: ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని బోండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనకు సంబంధించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యూదులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన ఇద్దరు నిందితుల్లో ఒకడైన సాజిద్ అక్రం (50) వద్ద భారతదేశ పాస్‌పోర్ట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అంతేకాక, అతడు ఆ పాస్‌పోర్ట్‌ను హైదరాబాద్ నుంచి పొందినట్లు చెబుతున్నారు. ఎదురుకాల్పుల్లో సాజిద్ మృతి చెందగా, అతని కుమారుడు నవీద్ అక్రం (24) గాయపడి చికిత్స పొందుతున్నాడు.
ఈ నేపథ్యంలో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కార్యాలయం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. సాజిద్ 27 ఏళ్ల క్రితం, 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లాడని డీజీపీ కార్యాలయం తెలిపింది. అక్కడ యూరోపియన్ యువతిని వివాహం చేసుకున్న అతడికి ఇద్దరు ఆస్ట్రేలియా పౌరులైన పిల్లలు ఉన్నారని పేర్కొంది.
సాజిద్ ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత కుటుంబ ఆస్తుల వ్యవహారాల కోసం ఆరుసార్లు భారత్‌కు వచ్చాడని, కానీ అతడికి హైదరాబాద్‌లో ఎలాంటి నేర చరిత్ర లేదని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. సాజిద్‌కి ఉగ్రవాదులతో ఉన్న సంబంధాల గురించి తమకేమీ తెలియదని హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులు తెలిపినట్లు వెల్లడించింది.
సాజిద్ ఇండియన్ పాస్‌పోర్ట్‌పై పాలస్తీనాకు ప్రయాణించగా, అతని కుమారుడు ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్‌పై ప్రయాణించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. మొదట్లో అతనికి పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు కథనాలొచ్చాయి.
