
బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర మరణం తర్వాత ఆ కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ధర్మేంద్ర మొదటి భార్య కుమారులైన సన్నీ డియోల్, బాబీ డియోల్.. రెండో భార్య హేమమాలిని, ఆమె కూతుళ్లను పూర్తిగా పక్కన పెట్టేశారనే వార్తలు జాతీయ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ముఖ్యంగా ధర్మేంద్ర అంత్యక్రియలు, సంతాప సభల సమయంలో ఈ రెండు కుటుంబాలు ఎక్కడా కలిసి కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది.
ధర్మేంద్ర కోసం సన్నీ, బాబీ డియోల్ ముంబైలో ప్రత్యేక ప్రార్థనా సమావేశం నిర్వహిస్తే, దానికి హేమమాలిని హాజరు కాలేదు. ఆమె తన కూతుళ్లు ఇషా, అహనాలతో కలిసి ఢిల్లీలో వేరేగా సంతాప సభ ఏర్పాటు చేశారు.
45 ఏళ్ల అనుబంధం ఉన్నా, కష్టకాలంలో హేమమాలినిని డియోల్ కుటుంబం దూరం పెట్టిందని ప్రముఖ రచయిత్రి శోభా డే వంటి వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే హేమ మాత్రం ఈ అవమానాన్ని దిగమింగుకుని చాలా హుందాగా వ్యవహరించారు.
మరోవైపు ధర్మేంద్ర పేరిట ఉన్న సుమారు 400 కోట్ల ఆస్తి విషయంలోనూ గొడవలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సవతి సోదరుల మధ్య ఆస్తి పోరు తప్పదని విశ్లేషకులు భావించారు.
కానీ హేమమాలిని మాత్రం ఎక్కడా బహిరంగంగా విమర్శలు చేయకుండా మౌనం పాటిస్తున్నారు. ఆమె ఎంపీగా ఉన్నా, అధికార బలంతో హడావిడి చేయకుండా తన భర్త గౌరవాన్ని కాపాడేలా ప్రవర్తించారు.
