
న్యూస్ డెస్క్: ఎయిరిండియా విమాన ప్రమాదం అనంతరం దేశవ్యాప్తంగా విమాన భద్రతపై డీజీసీఏ దృష్టి సారించింది. ఈ క్రమంలో కీలక విమానాశ్రయాల్లో చేపట్టిన తనిఖీల్లో ఆందోళన కలిగించే విషయాలు వెలుగుచూశాయి.
విమానాలు, రన్‌వేలు, సిబ్బంది శిక్షణ తదితర అంశాల్లో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలోని రెండు బృందాలు ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఫ్లైట్ ఆపరేషన్స్, ఏయిర్ ట్రాఫిక్ కంట్రోల్, కమ్యూనికేషన్ పరికరాలు, మెడికల్ టెస్టుల వరకు సమగ్రంగా పరిశీలించారని అధికారులు తెలిపారు.
తనిఖీల్లో ఒక విమానం అరిగిపోయిన టైర్లతో నిలిచిపోయిన ఉదంతం కలకలం రేపింది. కొన్ని విమానాల్లో ఒకే లోపాలు పునరావృతం కావడం పటిష్ట పర్యవేక్షణ లోపాన్ని సూచిస్తున్నదని డీజీసీఏ పేర్కొంది.
శిక్షణ కోసం ఉపయోగించే సిమ్యులేటర్లు కూడా వాస్తవ విమాన సెట్టింగులకు అనుగుణంగా లేవని, సాఫ్ట్‌వేర్ కూడా అప్‌డేట్ కాలేదని తెలిపారు. దీనివల్ల శిక్షణ నాణ్యతపై ప్రభావం పడుతోందని వారు అభిప్రాయపడ్డారు.
డీజీసీఏ ఇప్పటివరకు సంస్థల పేర్లు వెల్లడించలేదు. కానీ, గుర్తించిన లోపాలన్నింటినీ సంబంధిత సంస్థలకు తెలియజేశామని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
విమాన ప్రయాణ భద్రత విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని డీజీసీఏ స్పష్టం చేసింది. భవిష్యత్‌లో మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం.
DGCA, IndianAirports, FlightSafety, AviationNews, AirIndiaIncident,